Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 30

Fulfilling a Gurus's wish !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ముప్పదియవ సర్గము

( రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగము సుబాహు మారీచాదిరాక్షసుల దాడినుంచి సంరక్షించుట)

అథ తౌ దేశకాలజ్ఞౌ రాజపుత్రవరిందమౌ |
దేశే కాలే చ వాక్యజ్ఞానబ్రూతాం కౌశికం వచః ||

తా|| అప్పుడు దేశకాలజ్ఞానముగలవారు, దేశకాలానుగుణముగా మాట్లాడ గలవారు , శత్రుసంహారములో దక్షులు అయిన ఆ రాజకుమారులు విశ్వామిత్రునితో ఇట్లనిరి.

భగవన్ శ్రోతుమిచ్ఛావో యస్మిన్ కాలే నిశాచరౌ |
సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్ నాతివర్తేత తత్ క్షణమ్ ||

తా|| 'ఓ భగవన్ ! ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నము కలిగించుటకై ఎప్పుడు వచ్చెదరో వినుటకు కోరికాగనున్నది. యజ్ఞ సంరక్షణార్థము మేము సావధానులమై యుందుము'.

ఏవం బ్రువాణౌ కాకుత్ స్థౌ త్వరమాణౌ యుయుత్సయా |
సర్వే తే మునయః ప్రీతాః ప్రశశంసుః నృపాత్మజౌ ||
అద్యప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవం యువామ్ |
దీక్షాం గతో హ్యేష మునిః మౌనిత్వం చ గమిష్యతి ||

తా|| ఈ విధముగా పలుకుచూ ఆ కాకుస్థులిద్దరూ యుద్ధముచేయుటకు సిద్ధపడుచుండిరి. అప్పుడు ఆ మునులందరూ మిక్కిలి ప్రీతితో ఆ నృపాత్ముజులను ప్రశంసించుచూ ఇట్లనిరి. ' ఓ రాఘవా ! ఈ దినమునుంచి ఆరు రాత్రులు మీరు రక్షణాకార్యములో నుందురుగాక. ఈ మహాముని దీక్షలోనూ మౌనవ్రతములోనూ ఉండును'.

తౌ తు తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ |
అనిద్రౌ షడహోరాత్రం తపోవన మరక్షతామ్ ||
ఉపాసాం చక్రతుర్వీరౌ యత్తౌ పరమధన్వినౌ |
రరక్షతుర్మునివరం విశ్వామిత్రమరిందమౌ ||

తా|| యశోవంతులగు ఆ రాజకుమారులిద్దరూ నిద్రలేకుండా అహో రాత్రులు తపోవనుడైన ఆ విశ్వామిత్రుని ను రక్షించుచుండిరి. మహాధనుర్దారులైన ఆ వీరులు సావధానులై ఆ సమీపముననే నిలచి ముని వరుని రక్షణా కార్యక్రమములో నిమగ్నులై ఉండిరి.

అథ కాలే గతే తస్మిన్ షష్ఠేsహని సమాగతే |
సౌమిత్రిమ్ అబ్రవిద్రామో యత్తోభవ సమాహితః ||
రామస్యైవం బ్రువాణస్య త్వరితస్య యుయుత్సయా |
ప్రజజ్వాల తతో వేదిః సోపాధ్యాయో పురోహితా ||

తా|| ఆవిధముగా ఇదు దినముల కార్యక్రమము ముగిసెను. ఆరవ రోజు రాగానే శ్రీరాముడు లక్ష్మణునితో, 'నీవు సర్వ సన్నద్ధుడివిగా యుండుము' అని చెప్పెను. శ్రీరాముడు ఈ విధముగా అనుచుండగనే ఆ వేదికనుండి అగ్ని జ్వాలలు పైకి లేచెను.

స దర్భచమసస్రుక్కా ససమిత్కుసుమోచ్చయా |
విశ్వామిత్రేణ సహితా వేదిర్జజ్వాల సర్త్విజా ||

తా|| దర్భలు , చమసములు, స్రుక్కులు , సమిధలు, పుష్పముల తోనూ అలాగే విశ్వామిత్రుడు ఋత్విజులతో కూడిన ఆ యజ్ఞవేదిక ఒక్కసారిగా జ్వాలలతో ప్రజ్వరిల్లెను.

మంత్రవచ్ఛ యథాన్యాయం యజ్ఞోsసౌ సంప్రవర్తతే |
ఆకాశే చ మహాన్ శబ్దః ప్రాదురాసీ ద్భయానకః ||
ఆవార్య గగనం మేఘో యథా ప్రావృషి నిర్గతః |
తథా మాయాం వికుర్వాణౌ రాక్షసావభ్యధావతామ్||

తా|| యజ్ఞము వేదమంత్ర పూర్వకముగా యథాక్రమముగా కొనసాగుచుండెను. అప్పుడు ఆకాసమునుండి భయంకరమైన మహాశబ్దము బయలుదేరెను. వర్షా కాలపు ఆకాశమునందుండు మేఘములవలె రాక్షసులు తమతమ మాయలను ప్రదర్శించుచూ పరుగుపరుగున వచ్చిరి.

మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చ యే |
ఆగమ్య భీమ సంకాశా రుధిరౌఘం అవాసృజన్ ||
సా తేన రుధిరౌగేణ వేది రజ్జ్వాల మండితా |
సహసాభిద్రుతో రామః తానపస్యత్ తతో దివి ||

తా|| మారీచుడు సుబాహువు తమ తమ అనుచరులతో వచ్చి కుండపోతగా రక్తవర్షమును కురిపించిరి. ఆ రక్త వృష్టితో వేదికయొక్క పరిసరములు తడిసిపోయెను. తమ్మునితో గూడిన శ్రీరాముడు వెంటనే ఆ వేదికను చూచి క్రుద్ధుడై ఆకాసమునవున్న రాక్షసులను చూచెను.

తవాపతంతౌ సహసా దృష్ట్యా రాజీవ లోచనః |
లక్ష్మణం చాథ సంప్రేక్ష్య రామో వచనమబ్రవీత్ ||

తా|| రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ విధముగా వచ్చి పడుచున్న రాక్షసులను గాంచి లక్ష్మణునివేపు చూచి సాభిప్రాయముగా ఇట్లు పలికెను.

పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్ రాక్షసాన్ పిశితాశనాన్ |
మానవాస్త్రసమాధూతాన్ అనిలేన యథా ఘనాన్ ||
కరిష్యామి నసందేహో నోత్సహే హంతుమీదృశాన్ |
ఇత్యుక్త్వా వచనం రామః చాపే సంధాయవేగవాన్ ||
మానవం పరమోదారం అస్త్రం పరమభాస్వరమ్ |
చిక్షేప పరమకృద్ధో మారీచోరసి రాఘవః ||

తా || ఓ లక్ష్మణా వాయువు మేఘముల వలె నున్న మాంసబక్షకులు దుర్మార్గులు అయిన ఈ రాక్షసులను మానవాస్త్రముతో చెల్లా చదురుగ చేసెదను చూడుము. ఇట్టి పిరికిపందలను సంహరించుటకు ఏమాత్రము ఇష్ట పడను. అని పలికిఅ శ్రీరాముడు తన శరమును బంధించెను. అప్పుడు ఆ రాఘవుడు మిక్కిలి క్రుద్ధుడై మిక్క్కిలి శక్తిమంత మైనది కాంతులను విరజిమ్ముచున్నది అగు మానవాస్త్రమును మారీచుని వక్ష స్థలముపై ప్రయోగించెను.

న తేన పరమాస్త్రేణ మానవేన సమాహితః |
సంపూర్ణం యోజనశతం క్షిప్త స్సాగర సంప్లవే ||

తా|| ఆ మారీచుడు ఆ అమోఘమైన మానవాస్త్రము దెబ్బకి నూరుయోజనములదూరమున సముద్ర జలములలో పడిపోయెను.

విచేతనం విఘూర్ణంతం శీతేషు బలతాడితమ్ |
నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమబ్రవీత్ ||
ఇమానపి వధిష్యామి నిర్ఘృణాన్ దుష్టచారిణః |
రాక్షసాన్ పాపకర్మస్థాన్ యజ్ఞఘ్నాన్ రుధిరాశనాన్ ||

తా|| ఆ శీతేషు అను శరాఘాతమునకు గురి అయి స్పృహను కోలుపోయి, గిరగిరా తిరిగి దూరమునకు కొట్టుకుపోవుచున్న మారీచుని చూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను." ఈ దుర్మార్గులను వధించెదను. వీరు కఠినాత్ములు, పాపాత్ములు, యజ్ఞములను ధ్వంసము చేయువారు రక్తము త్రాగువారు".

సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతమ్ |
సుబాహురపి చిక్షేప స విద్ధః ప్రాపతద్భువి |
శేషాన్ వాయవ్య మాదాయ నిజఘాన మహాయశాః |
రాఘవః పరమోదారో మునీనాం ముదమావహాన్ ||
స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః |
ఋషిభిః పూజిత స్తత్ర యథేంద్రో విజయే పురా ||

తా|| పిమ్మట శ్రీరాముడు అద్భుతము , దివ్యము అయిన అగ్నేయాస్త్రమును సంధించి సుబాహువుని కొట్టెను. ఆ బాణముతో అతడు నేలపై కూలెను. అప్పుడు మిక్కిలి పరాక్రమవంతుడైన శ్రీరాముడు వాయవ్యాస్త్రముతో మిగిలిన రాక్షసులను వధించి మునులకు సంతోషము కూర్చెను. ఈ విధముగా ఆ రఘునందనుడు యజ్ఞమునకు విఘ్నము కలిగించు రాక్షసులను హతమార్చి పూర్వకాలములో విజయము పొందిన ఇంద్రునివలె మునివరుల పూజలను అందుకొనెను.

అథ యజ్ఞే సమాప్తే తు విశ్వామిత్రో మహామునిః |
నిరీతికా దిశో దృష్ట్వా కాకుత్ స్థ మిదమబ్రవీత్ ||

తా|| యజ్ఞము నిర్విఘ్నముగా సమాప్తమయ్యెను. అన్ని దిశలనుండి బాధలు తొలగిపోయెను. అది చూచి విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో ఇట్లనెను.

కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్తయా |
సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః ||

తా|| 'ఓ మహాబాహో ! కృతార్థుడనైతిని. నీవు గురువచనములను పాటించినావు. ఓ రామా ! 'సిద్ధాశ్రమమను పేరు సార్థకమైనది. ఈ చర్యతో నీ ఖ్యాతి ఇనుమడించినది' అని

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే త్రింశస్సర్గః ||
సమాప్తం ||

||ఈ విధముగా బాలకాండలోని ముప్పదియవ సర్గ సమాప్తము||
||ఓమ్ తత్ సత్ |

||om tat sat ||